Heart: ఎసిడిటీ అనుకుంటే హార్ట్ ఎటాక్... తేడా తెలుసుకునేదిలా!

- ఇటీవలి కాలంలో చాలా మందిలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య
- ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ వచ్చినా... అది ఎసిడిటీ కావొచ్చనే భావనతో నిర్లక్ష్యం
- జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్న నిపుణులు
సరైన సమయ పాలన లేకుండా ఆహారం తీసుకోవడం, బాగా మసాలాలు, కారం ఉన్న ఆహారం, ఫ్రైలు, జంక్ ఫుడ్ వంటివాటితో ఇటీవలి కాలంలో చాలా మందిలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య తలెత్తుతున్నాయి. తరచూ ఎసిడిటీకి లోనవుతున్నా... స్పైసీ, జంక్ ఫుడ్ అలవాట్లను మార్చుకోలేని వారు ఎందరో! అయితే గుండెపోటు వచ్చిన సమయంలోనూ చాలా వరకు ఎసిడిటీ వంటి లక్షణాలే కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి, ఆయాసం, కండరాలు పట్టేయడం వంటివి ఏర్పడితే... ఎసిడిటీ అని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని స్పష్టం చేస్తున్నారు.
కొన్ని నీళ్లుతాగి చూస్తే...
ఛాతీలో నొప్పి, ఆయాసం మొదలైతే... వెంటనే కొన్ని మంచినీళ్లు తాగి చూడాలని, వీలైతే గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉంటే యాంటాసిడ్ తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఇలా చేసినా ఏమాత్రం ఉపశమనం లేకుంటే... ఛాతీలో నుంచి నొప్పి భుజాలు, దవడ వంటి భాగాలకు విస్తరిస్తే... అది గుండెపోటు అయ్యే అవకాశం ఎక్కువని స్పష్టం చేస్తున్నారు.
మన కదలికలను బట్టి నొప్పి మారితే...
సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు వ్యక్తులు అటూ, ఇటూ నడిచినా, ఏదైనా పనిచేస్తూ ఉన్నా... ఛాతీలో నొప్పి మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. కదలడం ఆపివేసి, విశ్రాంతిగా కూర్చుంటే.. నొప్పి అదే స్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది.
అదే ఎసిడిటీ అయితే... అటూ, ఇటూ నడిచినా, ఏదైనా పనిచేస్తూ ఉన్నా... ఛాతీలో నొప్పి ఒకే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నొప్పి స్థాయిలో తేడా లేకుంటే ఎసిడిటీ అయ్యే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు. అలాగని నిర్లక్ష్యం చేయవద్దని... నొప్పి ఇతర భాగాలకు విస్తరించడం వంటి గుండెపోటు లక్షణాలు స్వల్ప స్థాయిలో కనిపించినా అప్రమత్తమై ఆస్పత్రికి వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు.