K Bapayya: ఆ సమయంలో జయలలిత ఆర్ధికంగా ఇబ్బందిపడ్డారు: దర్శకుడు కె బాపయ్య!

- శోభన్ బాబు జెంటిల్ మేన్ అంటూ కితాబునిచ్చిన బాపయ్య
- జయలలితకు అప్పటికి ఛాన్సులు తగ్గాయని వెల్లడి
- అందువలన ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారని వివరణ
- తన ఇంటిని ఆమె షూటింగులకు ఇచ్చారని వ్యాఖ్య
తెలుగు .. హిందీ భాషల్లో వరుస హిట్లు ఇచ్చిన అలనాటి దర్శకులలో కె బాపయ్య ఒకరు. అప్పటి స్టార్ హీరోలతో .. హీరోయిన్స్ తో ఆయనకి మంచి పరిచయాలు ఉండేవి. రీసెంటుగా ఆయన 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తెలుగులో శోభన్ బాబు - కృష్ణ ఇద్దరూ కూడా జెంటిల్ మెన్ అనదగినవారే. ఇద్దరూ ఎంతో ఓపికతో ఉండేవారు. తమ పోర్షన్ పూర్తవ్వగానే వెళ్లిపోయేవారు" అని అన్నారు.
"మొదట్లో జీనతమన్ యాక్టింగ్ నచ్చేది. ఆ తరువాత హేమమాలిని .. శ్రీదేవి నటన అంటే ఇష్టం ఉండేది. శ్రీదేవితోనే ఎక్కువ సినిమాలు చేశాను. జయలలిత గారి విషయానికి వస్తే, నేను దర్శకత్వం వైపుకు వచ్చేసరికి ఆమెకి సినిమాలు తగ్గిపోయాయి. తమిళంలో కూడా ఆమెకి సినిమాలు లేని పరిస్థితి. ఆమె చివరి సినిమాను తెలుగులో రామానాయుడుగారు తీశారు .. కానీ అది అంతగా ఆడలేదు" అని చెప్పారు.
" సినిమాలలో అవకాశాలు లేని సమయంలో ఆర్ధికంగా ఆమె ఇబ్బంది పడ్డారు. అప్పటివరకూ సంపాదించింది ఏమైపోయిందో తెలియదు. శోభన్ బాబు గారు కొంత సాయం చేస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె తన ఇల్లు షూటింగులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక సినిమా షూటింగు కోసం నేను కూడా ఆ ఇల్లు చూడటానికి వెళ్లినవాడినే. ఆ తరువాత ఆమె రాజకీయాలలోకి వెళ్లడం .. ముఖ్యమంత్రిగా ఎదగడం అందరికీ తెలిసిందే" అని అన్నారు.