Vijayasai Reddy: వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పానంటే..: విజయసాయిరెడ్డి

- వివేకా చనిపోయాడని తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడన్న విజయసాయిరెడ్డి
- అవినాశ్ కు ఫోన్ చేస్తే.. పక్కనున్న మరో వ్యక్తికి ఇచ్చారని వెల్లడి
- వివేకా గుండెపోటుతో చనిపోయారని పక్కనున్న వ్యక్తి చెప్పారన్న విజయసాయి
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే... గుండెపోటుతో చనిపోయారని మీరెందుకు అబద్ధం చెప్పారని విజయసాయిని మీడియా ప్రశ్నించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ... వివేకా చనిపోయినట్టు ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పాడని... వెంటనే తాను కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశానని తెలిపారు.
అవినాశ్ రెడ్డి పక్కన ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని... వివేకా గుండెపోటుతో చనిపోయారని సదరు వ్యక్తి తనకు చెప్పారని... అదే సమాచారాన్ని తాను మీడియాకు తెలియజేశానని విజయసాయి తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి మీకు చెప్పారా? అని ప్రశ్నించగా... ఈ విషయంపై గుచ్చిగుచ్చి అడగొద్దని కోరారు. తాను అవినాశ్ కు ఫోన్ చేసిన మాట నిజమని... అవినాశ్ పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చిన విషయం కూడా వాస్తవమని తెలిపారు. అవినాశ్ పక్కనున్న వ్యక్తి చెప్పిందే తాను మీడియాకు తెలిపానని అన్నారు.