Budda Venkanna: జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది: బుద్దా

Budda Venkanna Slams Vijayasai Reddy

  • ఎక్స్ వేదికగా విజయసాయిపై మండిపడ్డ బుద్దా వెంకన్న
  • చంద్రబాబుతో విభేదాలు లేవంటే ప్రజలు నమ్మేంత పిచ్చోళ్లు కాదన్న బుద్దా 
  • కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకంగా అభివర్ణించిన బుద్దా

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయసాయి రాజీనామా అంశంపై ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం ఇదంతా అని ఎక్స్ వేదికగా విమర్శించారు. 
 
చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు అని విజయసాయి అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదని అన్నారు. చంద్రబాబును విజయసాయి అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తుందని అన్నారు. చేసినవి అన్నీ చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలన్నారు. విజయసాయిరెడ్డికి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని బుద్దా విజ్ఞప్తి చేశారు.
 
చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి అన్న మాటలు ఎవరు మర్చిపోయినా నేను మరచిపోనని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
   

More Telugu News