World University Rankings 2024: ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అమెరికాదే ఆధిపత్యం.. టాప్-50లో భారత్‌కు దక్కని చోటు!

The USA Dominates the World University Ranking

  • ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‘
  • టాప్-50లో అమెరికాకు చెందిన 23 యూనివర్సిటీలు
  • టాప్ ప్లేస్‌లో యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
  • రెండు నుంచి వరుసగా 9 స్థానాల్లో అమెరికా వర్సిటీలు
  • చైనాకు చెందిన నాలుగు యూనివర్సిటీలకు చోటు

ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2024లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ రెండ్రోజుల క్రితం విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అత్యుత్తమంగా నిలిచినప్పటికీ అమెరికా యూనివర్సిటీల ఆధిపత్యం కొనసాగింది. జాబితాలో రెండు నుంచి వరుసగా 9వ స్థానం వరకు అమెరికా వర్సిటీలే ఉన్నాయి.

ప్రపంచంలోని 50 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో 23 అమెరికావే కావడం గమనార్హం. ఈ జాబితాలో యూకేకు చెందిన 7 యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. వీటిలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ కూడా వున్నాయి. భారత్ నుంచి ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ కూడా ఇందులో చోటు సంపాదించుకోలేకపోయింది.

ప్రపంచంలోని అత్యుత్తమ టాప్-50 యూనివర్సిటీల జాబితాలో చైనాకు చెందిన నాలుగు విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది. వీటిలో రాజధాని బీజింగ్‌లోని సింగువా, పెకింగ్ యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే, షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ, హాంగ్ఝౌలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలకు చోటు దక్కింది. కెనడా, జర్మనీకి చెందిన మూడేసి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్‌కు చెందిన రెండేసి యూనివర్సిటీలు, ఫ్రాన్స్, జపాన్, బెల్జియం, ఆస్ట్రేలియా, స్వీడన్‌కు చెందిన ఒక్కో యూనివర్సిటీ టాప్-50లోకి ఎక్కాయి. 

టీచింగ్, పరిశోధన వాతావరణ, పరిశోధన నాణ్యత, అంతర్జాతీయ దృక్పథం వంటి వాటి ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.  టాప్-30 పరంగా చూస్తే ఈ జాబితాలో 17 యూనివర్సిటీలు అమెరికావే కావడం దాని ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. యూకేకు చెందిన ఐదు, చైనా యూనివర్సిటీలు రెండు ఇందులో ఉన్నాయి. భారత్‌కు చెందిన ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News