Maharashtra: మహారాష్ట్రకు మరో డిప్యూటీ సీఎం ఖాయం: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

- మహా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి ప్రాధాన్యత లేదన్న సంజయ్ రౌత్
- తన పార్టీ నుంచే మరో ఉప ముఖ్యమంత్రి వస్తున్నందున షిండే అక్కడ ఉండరని వ్యాఖ్య
- ఈడీ, సీబీఐ కేసులకు భయపడే వారు పారిపోయారని ఎద్దేవా
మహారాష్ట్రకు త్వరలో మూడో డిప్యూటీ సీఎం వస్తారంటూ శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్ నాథ్ షిండేపై విమర్శలు గుప్పించారు.
ఏక్‌నాథ్ షిండేకి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదని అన్నారు. షిండే వర్గానికి చెందిన నేతనే రాష్ట్రానికి మూడో డిప్యూటీ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. మహారాష్ట్రకు అదే పార్టీ నుంచి మూడవ ఉప ముఖ్యమంత్రి వస్తున్నందున ఆయన (షిండే) రేపు అక్కడ ఉండరన్నారు.
శివసేన రెండుగా విడిపోవడంపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐలకు భయపడి వారు (షిండే వర్గం) పారిపోయారని వ్యాఖ్యానించారు. శివసేన (యూటీబీ) మాత్రం అన్నింటినీ తట్టుకుని బలంగా నిలబడుతోందని అన్నారు.