Chandrababu: దావోస్ చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండండి... అధికారులకు చంద్రబాబు ఆదేశాలు 

CM Chandrababu gives key instructions to officials over Davos proposals

  • దావోస్ ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లడంపై చంద్రబాబు ఫోకస్  
  • దావోస్ చర్చలతో త్వరలో రాష్ట్రానికి దిగ్గజ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు  
  • ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సీఎస్ కు సూచన

దావోస్‌ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయా సంస్థలతో జరిగిన చర్చలు, ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టారు. దావోస్ లో తాము జరిపిన పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఎంఓ అధికారులతో దావోస్ పర్యటనపై చర్చించారు. మూడు రోజుల పాటు ఆయా కంపెనీల సీఈఓలు, ఛైర్మన్‌లు, ప్రతినిధులతో వివిధ రంగాల్లో పెట్టుబడులపై జరిపిన చర్చలను అధికారులకు వివరించారు. 

మౌలిక సదుపాయాలు, మారిటైం హబ్, ఏఐ యూనివర్సిటీ, జీసీసీ, డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్, కోర్ ఇంజనీరింగ్, తయారీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఈ కామర్స్, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఆయా సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలను అధికారులకు తెలిపి, రానున్న ఆరు నెలల కాలంలో వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరిగిన చర్చల కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, పలు సంస్థల సీఈఓలు, ఆయా దేశాల మంత్రుల బృందాలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నాయని, అందుకు ఆయా శాఖలు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దిగ్గజ కంపెనీల సీఈఓలతో జరిగిన చర్చలపై సంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి, పెట్టుబడులు పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. 

కంపెనీలతో నిరంతరం సమీక్షలు, సంప్రదింపులు జరపడం ద్వారా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చూడాలని, వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ విజయానంద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News