Ravindra Jadeja: 12 వికెట్లతో రవీంద్ర జడేజా విజృంభణ... పంత్ జట్టు ఘోర పరాజయం

- సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య రంజీ మ్యాచ్
- ఢిల్లీని 10 వికెట్ల తేడాతో ఓడించిన సౌరాష్ట్ర
- సౌరాష్ట్ర తరఫున బరిలోకి జడేజా.. ఢిల్లీకి పంత్ ప్రాతినిధ్యం
- బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన రిషభ్ పంత్
- బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో సౌరాష్ట్రకు విజయాన్ని అందించిన జడ్డూ
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి టీమిండియా స్టార్ ప్లేయర్లు ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరందరూ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. కానీ, రవీంద్ర జడేజా మాత్రం బౌలింగ్‌లో సత్తాచాటాడు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన అతడు... రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు సాధించాడు. దీంతో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.
ఇక ఢిల్లీ జట్టులో ఉన్న పంత్‌పై అందరి కళ్లు ఉండగా... అతడు మాత్రం మరోసారి ఫెయిల్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో 1 పరుగుకే పెవిలియన్ చేరిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 17 రన్స్ మాత్రమే చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో జడ్డూ (5 వికెట్లు) దెబ్బకు ఢిల్లీ 188 రన్స్‌కే పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 271 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 83 పరుగుల ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీని మరోసారి జడేజా ఘోరంగా దెబ్బ తీశాడు. 38 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఢిల్లీ జట్టు కేవలం 94 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర ముందు 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ టార్గెట్‌ను సౌరాష్ట్ర వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 12 వికెట్లు తీసిన జడ్డూకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కాగా, జడేజాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 36వ సారి.
అటు, జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్, యశస్వి జైస్వాల్ ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులే చేసినా... రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 28 రన్స్ తో పర్వాలేదనిపించాడు.