Ibrahim Yucel: ధూమపానం మానేయడానికి వ్యక్తి వింత నిర్ణయం.. అసలేం చేశాడో తెలిస్తే.. ఔరా అనాల్సిందే!

- తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ సిగరెట్ మానేయడానికి వింత నిర్ణయం
- తన తలకు ఇనుప తీగలతో చేసిన బంతి లాంటి హెల్మెట్ ధరిస్తున్న వైనం
- ఆ హెల్మెట్ కి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇచ్చిన ఇబ్రహీం
- 2013 నుంచి ఇలాగే హెల్మెట్‌తోనే దర్శనం
ధూమపానం ఒకసారి అలవాటైతే మానేయడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా. అయితే, ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో కొద్ది శాతం మాత్రమే దీని నుంచి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఇదే కోవకు చెందినవాడు.
సుమారు 11 సంవత్సరాల క్రితం తనకు ఉన్న ధూమపానం వ్యసనాన్ని మానేయడానికి ఆ వ్యక్తి ఒక వింత నిర్ణయం తీసుకోవడంతో వార్తల్లో నిలిచాడు. తన తలకు ఇనుప తీగలతో చేసిన బంతి లాంటి హెల్మెట్ ధరిస్తున్నాడు. దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నాడు.
తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేయడానికి ఇలా వింత నిర్ణయం తీసుకున్నాడు. 2013 నుంచి అతడు ఇలాగే హెల్మెట్‌తోనే దర్శనమిస్తున్నాడు. అంతకుముందు 26 ఏళ్లు ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవాడట.
ప్రతి సంవత్సరం తన ముగ్గురు పిల్లల పుట్టినరోజు, అతని వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానేసేవాడు. కానీ, ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు తాగడం చేస్తుండేవాడు. ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకున్న ఇబ్రహీంకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాడు. అప్పటి నుంచి ఇలా తన తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించడం చేస్తున్నాడు. ఇప్పటికీ అలాగే ఈ వింత హెల్మెట్‌తో దర్శనమిస్తూ వార్తల్లో నిలిచాడు.

ఇదిలాఉంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది పొగాకు వాడకం వల్ల చనిపోతున్నారు. అలాగే ధూమపానం చేయని వారికి కూడా పొగాకు ప్రాణాంతకం అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ధూమపానం చేసేవారు వదిలే పొగను పక్కన ఉండేవారు పీలిస్తే (పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్) వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. దీనివల్ల ఏటా 1.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు.
అటు పిల్లలలో దాదాపు సగం మంది పొగాకు పొగ వల్ల కలుషితమైన గాలిని పీల్చుకుంటారు. సెకండ్ హ్యాండ్ పొగకు సంబంధించిన అనారోగ్యాల కారణంగా ప్రతి సంవత్సరం 65,000 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ధూమపానం చేయడం వలన శిశువులకు అనేక జీవితకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.