Siddarth Desai: రంజీట్రోఫీలో గుజరాత్ స్పిన్నర్ సంచలన బౌలింగ్.. వీడియో ఇదిగో!

- 15 ఓవర్లు వేసి 5 మెయిడిన్లు తీసుకుని 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్
- ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డ్
- రంజీల్లో వినూభాయ్ ధ్రువ్ రికార్డు బద్దలు
- సిద్ధార్థ్ దెబ్బకు 111 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్థి జట్టు
రంజీ ట్రోఫీలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 15 ఓవర్లు వేసిన దేశాయ్ 36 పరుగులే ఇచ్చి ఈ ఘనత సాధించాడు. ఇందులో 5 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం. ఉత్తరాఖండ్ కోల్పోయిన మొదటి 9 వికెట్లు సిద్ధార్థ్ ఖాతాలోనే పడ్డాయి. చివరి వికెట్ విశాల్ జైశ్వాల్‌కు చిక్కడంతో పదికి పది వికెట్లు తీసుకోవాలన్న సిద్ధార్థ్ ఆశ నెరవేరలేదు.
ఇక రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు వినూభాయ్ ధ్రువ్ పేరిట ఉంది. ఇప్పుడా రికార్డును సిద్ధార్థ్ బద్దలుగొట్టి గుజరాత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో వినూభాయ్ 31 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు.
ఇక సిద్ధార్థ్ బౌలింగ్ దెబ్బకు ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 30 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. శాశ్వత్ దంగ్వాల్ చేసిన 35 పరుగులే జట్టులో అత్యధికం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో 79 పరుగుల ఆధిక్యం లభించింది. ఉర్విల్ పటేల్ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. మనన్ హింగ్రాజియా (66), జైమిత్ పటేల్ (29) క్రీజులో ఉన్నారు.