Income Tax: బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట.. రూ. 10 లక్షల వరకు ఐటీ లేనట్టే?

- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- రూ. 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వచ్చంటూ కథనాలు
- ఆదాయపన్ను శ్లాబుల్లోనూ పలు మార్పులు చేసే యోచన
- రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలపై 5 శాతం పన్ను తగ్గింపు!
బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించనుంది. ఈసారి రూ. 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రకటన ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు ఉండటంతో రూ. 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని రూ. 10 లక్షలకు పెంచబోతున్నట్టు తెలిసింది.
అలాగే, ఆదాయపన్ను శ్లాబుల్లో పలు మార్పులు కూడా చేయబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 30 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని 25 శాతానికి తగ్గించబోతున్నట్టు సమాచారం. దీనివల్ల రూ. 15 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట లభిస్తుంది. అంతేకాదు, కొనుగోలుదారుల చేతిలో డబ్బులు ఉండటం వల్ల వారు మరింత వ్యయం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, దీనివల్ల అంతిమంగా ప్రభుత్వానికే మేలు జరుగుతుందని చెబుతున్నారు.