venkateswara swamy temple: వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.2 వేల నోట్ల ప్రత్యక్షం

- తెనాలి సమీపంలోని వైకుంఠపురం ఆలయ హుండీ కానుకల్లో బయటపడిన రూ.2వేల నోట్లు
- చెల్లని నోట్లను హుండీలో కానుకగా వేసిన అజ్ఞాత భక్తుడు
- రూ.2 వేల నోట్లు మొత్తం 122 (రూ.2.44 లక్షలు) హుండీలో కానుకగా వచ్చిన వైనం
దేశ వ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణి 2023లో రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రద్దయిన రూ.2 వేల నోట్లు ఇప్పుడు బయటపడటం, అదీ ఓ ఆలయ హుండీ కానుకల్లో ప్రత్యక్ష కావడం హాట్ టాపిక్ అయింది. చెల్లుబాటు కాని నోట్లు ఇంట్లో ఉంటే ఎటువంటి ఉపయోగం లేదని, దేవుడి హుండీలో కానుకగా వేస్తే పుణ్యం అయినా వస్తుందని అనుకున్నాడో ఏమో ఓ భక్తుడు ఆ నోట్లు స్వామి వారికి కానుకగా వేసినట్లున్నాడు.
విషయంలోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వైకుంఠపురం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీ కానుకల లెక్కింపు జరుపుతుండగా, రూ.2వేల నోట్లు బయటపడ్డాయి.
మొత్తం 122 (రూ.2.44 లక్షలు) నోట్లు హుండీ కానుకల్లో రావడంతో ఆలయ సిబ్బంది కంగుతిన్నారు. హుండీ కానుకల్లో రద్దయిన రూ.2వేల నోట్లు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెల్లని నోట్లు భగవంతుడికి కానుకగా వేసిన ఆ అజ్ఞాత భక్తుడు ఎవరో మరి..!