Umar Nazir Mir: ఎవరీ ఉమర్ నజీర్ మిర్... రోహిత్ సహా భారత స్టార్ బ్యాటర్లను బెంబేలెత్తించాడుగా...!

- రంజీ మ్యాచ్‌లోనూ విఫలమైన రోహిత్ శర్మ
- మళ్లీ అదే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హిట్‌మ్యాన్
- షార్ట్ పిచ్ బంతితో రోహిత్ ను బోల్తా కొట్టించిన జమ్మూ బౌలర్ ఉమర్ నజీర్ మిర్
- రోహిత్ సహా ముంబయి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన 31 ఏళ్ల పేసర్
- పుల్వామాకు చెందిన ఉమర్.. చక్కటి పేస్‌తో పాటు బంతిని బౌన్స్ చేయడంలో దిట్ట
గత కొంతకాలంగా భారత జట్టు టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈరోజు జమ్ముకాశ్మీర్ జట్టుతో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో ముంబయి తరఫున హిట్‌మ్యాన్ బరిలోకి దిగాడు. కానీ, ఇక్కడ కూడా విఫలమయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
రోహిత్ తో పాటు ముంబయి జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్లు అజింక్య రహానే, శివమ్ దూబే, హార్దిక్ తమోర్‌లను ఒకే బౌలర్ ఔట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ నలుగురిని ఏమాత్రం క్రీజులో కుదురుకోకుండా బెంబేలెత్తించాడు. అతడే.. ఉమర్ నజీర్ మిర్. 31 ఏళ్ల ఈ జమ్ముకాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
చక్కటి పేస్‌తో పాటు బంతిని బౌన్స్ చేయడంలో ఉమర్ దిట్ట. ఇవాళ అదే చేశాడు. మొదట హిట్‌మ్యాన్‌ను ఓ షార్ట్ పిచ్ బంతితో ఊరించి ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ తమోర్ పెవిలియన్‌కు పంపించాడు. అలాగే ముంబయి కెప్టెన్ అజింక్య రహానేను కూడా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు.
ఇక శివమ్ దూబేను అయితే తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇలా ముంబయి ఇన్నింగ్స్‌ను ఉమర్ కకావికలం చేశాడు. దీంతో ఉమర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. స్టార్ బ్యాటర్లను బెంబేలెత్తించిన ఈ పేసర్‌పై నెటింట ప్రశంసలు జల్లు కురుస్తోంది.
ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడువు ఉండే ఉమర్ నజీర్ మిర్.. బంతిని ఎలా సంధించాలంటే అలా చాలా ఈజీగా విసురుతుంటాడు. దీనికి అతని హైట్ ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి.
2013లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కెరీర్ ప్రారంభించిన అతడు ఇప్పటివరకు 57 మ్యాచ్ లు ఆడి, 138 వికెట్లు తీశాడు.
అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో భాగంగా 54 టీ20ల్లో 32 వికెట్లు సాధించాడు. పుల్వామాకు చెందిన ఉమర్... దేవ్‌ధర్ ట్రోఫీ 2018-19లో భారత్-సీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. కానీ, టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు.