Telangana Davos: దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం సూపర్ సక్సెస్... రికార్డు స్థాయిలో ఒప్పందాలు!

Telangana government successful in attracting huge investments in Davos

  • 10 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు
  • రాష్ట్రానికి రానున్న పెట్టుబడుల విలువ రూ. 1.32 లక్షల కోట్లు
  • గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగిన పెట్టుబడులు

తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా పర్యటనను ముగించారు. రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయింది. మూడు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 

గత ఏడాది దావోస్ పర్యటనతో తెలంగాణకు రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడులు మూడింతలు పెరగడం గమనార్హం. ఈ ఏడాది రేవంత్ నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం అంచనాలకు మించి సక్సెస్ అయింది. ఈ సాయంత్రం వీరంతా దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు. రేపు వీరు హైదరాబాద్ కు చేరుకుంటారు.

తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలు ఇవే:
  • అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లు - రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు.
  • జేఎస్ డబ్ల్యూ - ఏఐ డేటా సెంటర్ - రూ. 800 కోట్లు.
  • కంట్రోల్ ఎస్: ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ - రూ. 10 వేల కోట్లు.
  • సన్ పెట్రో కెమికల్స్: సోలార్ ప్రాజెక్టులు, భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు - రూ. 45,500 కోట్ల పెట్టుబడులు.
  • మేఘా ఇంజినీరింగ్: పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్ - రూ. 15 వేల కోట్లు.
  • స్కైరూట్ ఏరో స్పేస్: ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, టెస్టింగ్ యూనిట్ - రూ. 500 కోట్లు.
  • వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యూనిలీవర్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి.

  • Loading...

More Telugu News