Jio and Airtel: యూజర్లకు భారీ ప్రయోజనం చేకూరేలా... జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్!

- ట్రాయ్ ఆదేశాల మేరకు జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు
- వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించిన రెండూ టెలికాం కంపెనీలు
- రూ. 458, రూ. 1,958ల రీఛార్జిలతో జియో ప్లాన్స్
- జియో మాదిరిగానే రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ను తీసుకొచ్చిన ఎయిర్‌టెల్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చాయి. కేవలం వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసమే ప్రత్యేకంగా వీటిని తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పుడు వినియోగదారులు తమకు అవసరం లేనప్పుడు డేటా కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద సంఖ్యలో యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో, ఎయిర్‌టెల్ ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించాయి. కాలింగ్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలను మాత్రమే అందించే ఈ ప్లాన్‌లు ఇప్పుడు రెండు కంపెనీల వెబ్‌సైట్‌లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ట్రాయ్ 2024 డిసెంబర్ 23న అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. డేటా అవసరం లేని వారికి ఇలాంటి ప్లాన్‌లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు రెండు సిమ్‌లను ఉపయోగించే వారికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది.
రూ. 458, రూ. 1,958లతో జియో ప్లాన్‌లు..
ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. రూ. 458, రూ. 1,958 ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్‌తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొందవచ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు. అదేవిధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు.
ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఇవే..
జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను తీసుకువచ్చింది. కంపెనీ రూ. 509 ప్లాన్‌లో 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 900 ఎస్సెమ్మెస్‌లను అందిస్తోంది. అలాగే రూ. 1,999 ప్లాన్‌లో వినియోగదారులు ఒక ఏడాది చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.