Davos: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న జేఎస్ డబ్ల్యూ.. దావోస్ లో ఒప్పందం

- మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్న జేఎస్ డబ్ల్యూ
- రూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జేఎస్ డబ్ల్యూ
- డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందన్న రేవంత్ రెడ్డి
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి.
తాజాగా తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ను స్థాపించనున్నట్టు జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ ను నెలకొల్పనుంది. రూ. 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు జేఎస్ డబ్ల్యూతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సంస్థతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఒప్పందంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ... రక్షణ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని చెప్పారు.