Bollywood: చంపేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రిటీలకు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు

Death threats to bollywood celebrities from Pakistan

  • కపిల్‌శర్మ, రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాలను చంపేస్తామంటూ ఈమెయిల్
  • 8 గంటల్లోగా స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
  • ఐపీ అడ్రస్ ఆధారంగా పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తింపు

బాలీవుడ్ సెలబ్రిటీలు కమెడియన్ కపిల్‌శర్మ, నటుడు రాజ్‌పాల్ యాదవ్, కొరియాగ్రాఫర్ రెమో డిసౌజా, నటుడు, సింగర్ సుగంధ మిశ్రాను చంపేస్తామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబైలోని అంబోలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ బెదిరింపులు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో పాక్ ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేందుకు భారత ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. నిందితులు సెలబ్రిటీలను బెదిరిస్తూ... 8 గంటల్లో ప్రతిస్పందించాలని, లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు కపిల్‌శర్మ బృందానికి భద్రత కల్పించారు.

కామెడీతో నవ్వించే కపిల్‌శర్మ ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్’వంటి షోలతో అందరికీ సుపరిచితుడిగా మారాడు. కామెడీ నైట్స్ వంటి షోలతో దేశంలోని ప్రముఖ కమెడియన్స్‌లో ఒకడిగా మారాడు. అలాగే, పలు సినిమాల్లోనూ నటించాడు. నటుడు రాజ్‌పాల్ యాదవ్ పలు సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించాడు. అతడి చివరి సినిమా ‘భూల్ భులైయా 3’.  

‘ఇటీవల కొంతకాలంగా నీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ కాదు. వేధించే ప్రయత్నం కూడా కాదు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకో’ అని కపిల్‌కు పంపిన ఈమెయిల్‌లో నిందితులు హెచ్చరికలు జారీచేశారు. 8 గంటల్లో స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరిక కూడా ఉంది. దీనికింద ‘బిష్ణు’ పేరు కూడా ఉంది. దీంతో ఈ బెదిరింపులు గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News