Crime News: హైదరాబాద్ లో ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!

husband killed his wife in meerpet

  • రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 
  • భార్య కనిపించకుండా పోయిందంటూ పోలీసు స్టేషన్‌లో గురుమూర్తి ఫిర్యాదు
  • పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి

తన భార్యను హత్య చేయడమే కాక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత ఆ అవశేషాలను చెరువులో పడవేశాడు ఓ రాక్షసుడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు భార్య వెంకట మాధవి కనిపించడం లేదని అత్త సుబ్బమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 16న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ అత్త సుబ్బమ్మతో కలిసి గురుమూర్తి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

భార్య, భర్తల మధ్య గొడవలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. 

గురుమూర్తి తెలిపిన విషయాలపై ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహం అవశేషాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మీర్‌పేట పోలీసులు స్పందిస్తూ, వెంకట మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసులో ఆధారాలు లభిస్తే మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పు చేసి గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు.

Crime News
Ranga Reddy District
meerpet
husband killed his wife
  • Loading...

More Telugu News