Telangana: తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చుతాం... మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తాం: రేవంత్ రెడ్డి

- తెలంగాణలో డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం
- డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తామన్న ముఖ్యమంత్రి
- హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి
తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌస్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ డ్రైపోర్టును సమీపంలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్, సీఐఐ, హీరో మోటో కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని కోరారు.
ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేశామన్నారు.
దేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వాహనాల విక్రయాలు తెలంగాణలోనే జరుగుతున్నట్లు చెప్పారు. పర్యావరణ అనుకూల వాహనాల కోసం జీహెచ్ఎంసీలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కోటికి పైగా జనాభా ఉందని, 100 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.