Kapil Dev: కోహ్లీ, రోహిత్ లపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

- పాత రికార్డులతో జట్టులో ఎక్కువకాలం ఉండలేమన్న మాజీ క్రికెటర్
- ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ ఫామ్ కొనసాగించాలని సూచన
- వరుసగా విఫలమవుతుంటే సీనియర్ అనే సాకుతో అవకాశం కల్పించడం అర్ధరహితమని వ్యాఖ్య
జట్టులో కొనసాగాలంటే నిరంతరం మెరుగుపడుతూనే ఉండాలని, గతంలో సాధించిన రికార్డుల ఆధారంగా ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేమని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఉద్దేశిస్తూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీ, రోహిత్ లు గతంలో ఎన్నో రికార్డులు సాధించి ఉండొచ్చని, అయినా వరుసగా విఫలమవుతుంటే అవకాశమివ్వడంలో అర్థంలేదని స్పష్టం చేశారు. తుది జట్టులో కొనసాగాలంటే ఫామ్ కొనసాగిస్తూ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాల్సిందేనని వారికి సలహా ఇచ్చారు.
తుది జట్టులో చోటుకోసం పోటీ ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఫామ్ లో ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేయాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ గత కీర్తి ఆధారంగా సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించడం సరికాదన్నారు. ఒకవేళ కొత్త కుర్రాళ్లు విఫలమైతే తర్వాతి టోర్నమెంట్ కు వారిని పక్కన పెడతారని గుర్తుచేస్తూ సీనియర్లకు మాత్రం ఈ మినహాయింపు దేనికని ప్రశ్నించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో కోహ్లీ, రోహిత్ లను ఎంపిక చేయడంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. ఫామ్ లో లేని కోహ్లీ స్థానంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు ఆడాలని, అప్పుడే అతడికి, జట్టుకూ ప్రయోజనమని చెప్పారు.