Kootickal Jaychandran: నాలుగేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో నటుడు జయచంద్రన్‌పై లుక్ అవుట్ నోటీసు

- బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు
- ముందస్తు బెయిలు నిరాకరించిన కేరళ హైకోర్టు
- నటుడిపై చర్యలకు బాధిత కుటుంబ సభ్యుల ఒత్తిడి
పోక్సోలో తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ మలయాళ నటుడు కూటిక్కళ్ జయచంద్రన్ ఉరఫ్ కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రన్‌పై కోజికోడ్‌లోని కసబ పోలీస్ స్టేషన్‌లో గతేడాది కేసు నమోదైంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో నటుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో జయచంద్రన్ ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించగా కేరళ హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు కోజికోడ్ సెషన్స్ కోర్టు కూడా బెయిలు నిరాకరించింది. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు కసబ పోలీసులకు సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.