Kaante Wale Baba: కుంభమేళాలో ముళ్లబాబాకు ఘోర అవమానం.. యువతి వాగ్వివాదం.. నిస్సహాయంగా చూస్తుండిపోయిన బాబా!

- ‘కాంటేవాలాబాబా’తో యువతి వాగ్వివాదం
- ఆయన వద్దనున్న నాణేలు ఇవ్వాలని డిమాండ్
- చుట్టూ ఉన్న వారు కూడా ఆమెకు వత్తాసు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘కాంటేవాలాబాబా’ (ముళ్ల బాబా)ను ఓ యువతి వేధిస్తున్న వీడియో వైరల్ అయింది. బాబాతో ఆమె కోపంగా, అసభ్యంగా మాట్లాడింది. బాబాతో వాదిస్తూ కనిపించింది. చుట్టూ ఉన్నవారు కూడా యువతికే వత్తాసు పలకడంతో బాబా అసహాయంగా మిగిలిపోయారు.
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామేశ్ కుమార్ మాంజీ.. కాంటే వాలా బాబాగా సుపరిచితులు. ప్రతి కుంభమేళాకు ఆయన హాజరవుతుంటారు. కుంభమేళాలో ముళ్లపై కూర్చుని శారీరక, మానసిక బాధను అనుభవిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇది కుంభమేళాను దర్శించుకునే భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆయన ఎవరినీ డబ్బులు అడగరు. ఎవరైనా ఇస్తే కాదనకుండా పుచ్చుకుంటారు.
ముళ్లబాబాతో యువతి అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బాబాతో వాగ్వివాదానికి దిగిన యువతి ఆయననో మాయగాడిగా అభివర్ణించింది. ఆయన వద్ద ఉన్న చిల్లరను ఇస్తే తాను రెండంటే రెండే నిమిషాల్లో నోట్లుగా మార్చి ఇస్తానని గొడవ పెట్టుకుంది. అయితే, ఆమెకు నాణేలు ఇచ్చేందుకు నిరాకరించారు.
చుట్టూ గుమికూడిన వారు కూడా యువతికే మద్దతు పలికారు. దీంతో ఆయన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. బాబాను అవమానించిన యువతి కర్మను అనుభవించక తప్పదని, అందుకోసం ఎదురుచూస్తున్నానని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.