Punjab: జాక్‌పాట్ అంటే ఇదే.. ట్రక్ డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ!

- పంజాబ్‌కు చెందిన డ్రైవర్ హర్పిందర్ సింగ్‌కు జాక్‌పాట్
- కువైట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సింగ్
- ఇటీవలే స్వగ్రామానికి వచ్చి రూ.10 కోట్ల లాటరీ గెలిచిన వైనం
పంజాబ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ జాక్‌పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025లో రూప్ నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు రాష్ట్రంలో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదే కావడం విశేషం.
కాగా, హర్పిందర్ సింగ్ కువైట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని రోపర్ జిల్లా బద్వా గ్రామానికి చెందిన అతడు ఇటీవల సెలవులపై స్వగ్రామానికి తిరిగొచ్చాడు.
తన కుటుంబాన్ని కలవడానికి తన గ్రామానికి వచ్చిన హర్పిందర్ సింగ్... రోపర్ జిల్లా, నూర్పూర్ బేడి పట్టణంలోని అశోకా లాటరీ నుంచి రూ. 500 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అదే అతడిని విజేతగా నిలపడంతో పాటు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.
“నేను క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొనేవాడిని. ఈసారి నేను లోహ్రీ బంపర్ టిక్కెట్లను కొనుగోలు చేశాను. తాజాగా నేను లాటరీ గెలిచినట్లు అశోక లాటరీ నుంచి కాల్ వచ్చింది” అని హర్పిందర్ సింగ్ చెప్పారు.
తాను కువైట్ వెళ్లేందుకు చాలా ఖర్చు పెట్టానని చెప్పాడు. దాంతో చాలా అప్పులు అయ్యాయని, వాటిని తీర్చాలని తెలిపాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, చాలా కాలంగా ట్రక్కులు నడుపుతున్నానని హర్పిందర్ పేర్కొన్నాడు. ఇక తాను గెలిచిన భారీ మొత్తంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి, మరికొంత భాగాన్ని తన కుటుంటం కోసం వెచ్చిస్తానని చెప్పుకొచ్చాడు.
కాగా, ప్రైజ్ మనీలో 30 శాతం అదనపు ఆదాయపు పన్నుగా మినహాయించబడుతుందని పంజాబ్ రాష్ట్ర లాటరీల విభాగం అధికారులు వెల్లడించారు.