kidney racket: సరూర్ నగర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కలకలం

kidney racket in sarurnagar

  • అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన అలకనంద ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
  • ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు
  • గాంధీ ఆసుపత్రికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స బాధితుల తరలింపు 

అమాయకులకు డబ్బు ఎరవేసి వారి నుంచి కిడ్నీలు సేకరించి, రోగులకు కిడ్నీ మార్పిడి నిర్వహిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఓ ఆసుపత్రి నిర్వాకం హైదరాబాదులో వెలుగు చూసింది. సరూర్‌నగర్ డివిజన్‌లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణతో పాటు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్న సమాచారంతో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎం అండ్ హెచ్‌వో వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 

ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బుల ఆశ చూపి, ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల నిర్వహణ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా, వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. 

ఈ క్రమంలో కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు రోగులను నాలుగు అంబులెన్స్‌లలో పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రి ఎండీ సుమంత్ చారి, సిబ్బందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News