Nara Lokesh: మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో నారా లోకేశ్ భేటీ

Nara Lokesh held meeting with Master Card Health Care Marketing Chief Rajamannar

  • దావోస్ లో ఏపీ మంత్రి నారా లోకేశ్ బిజీబిజీ
  • దక్షిణాదిన మాస్టర్ కార్డ్ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందన్న లోకేశ్
  • త్వరలోనే ఏపీలో విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్న రాజమన్నార్ 

ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ ఆర్డీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తాజగా, మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఐటీ వర్క్ ఫోర్స్, స్కిల్ డెవలప్ మెంట్ కార్యకలాపాలకు మాస్టర్ కార్డ్ సహకారం అందిస్తే బాగుంటుందని సూచించారు. 

మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ స్పందిస్తూ... భారత్ లో 'పాస్ కీ' చెల్లింపుల సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. సురక్షిత ఆన్ లైన్ లావాదేవీల కోసం ఓటీపీ ఆధారిత సేవలు అందిస్తామని చెప్పారు. వ్యవసాయ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో 100 కోట్ల కస్టమర్లే తమ లక్ష్యమని రాజమన్నార్ స్పష్టం చేశారు. దాంతోపాటే, ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ వ్యాపారాల డిజిటలీకరణను కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 

భారతదేశంలో పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలను ఉపయోగించుకుంటామని, భాగస్వాములతో కలిసి సేవల విస్తరణకు మాస్టర్ కార్డ్ ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. తమ కంపెనీ బోర్డు సభ్యులతో చర్చించాక ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా స్వనీతి రౌండ్ టేబుల్ సమావేశం... హాజరైన లోకేశ్

దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 'పర్యావరణ పరిరక్షణ-వాతావరణ ఉద్యమం భవిష్యత్తు' అనే అంశంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పోర్చుగల్ మాజీ ప్రధానితో పాటు జోర్డాన్ రాణి, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్, తదితరులు హాజరయ్యారు. 

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడుతూ... కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఏకైక పరిష్కారం అన్నారు. సుస్థిర శక్తి వనరుల రంగంలో ప్రపంచ అగ్రగామి అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు యత్నాలు చేస్తున్నామని వివరించారు. పునరుత్పాదక రంగంలో ఏపీ గణనీయ ప్రగతి సాధిస్తోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏపీలో నాలుగు సోలార్ ఎనర్జీ పార్కులు ప్రకటించిందని వెల్లడించారు. హరిత, ఆర్థిక, ఇంధన పర్యావరణ వ్యవస్థ స్థాపనే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించామని అంతర్జాతీయ వేదికపై లోకేశ్ ఉద్ఘాటించారు. 

పునరుత్పాదక శక్తి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని... తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని వివరించారు. ఏపీలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలు గుర్తించామని, ప్రపంచంలోనే అతి పెద్ద ఐఆర్ఈఎస్పీ ప్రాజెక్టును ఏపీ కలిగి ఉందని అన్నారు. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News