Harish Rao: రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారు: హరీశ్ రావు

- సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న హరీశ్ రావు
- గ్రామసభల్లో ఊరూరా జనం తిరగబడుతున్నారని వ్యాఖ్యలు
- కాంగ్రెస్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అంటూ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో... మంత్రులు అందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ఇక ప్రజలను ఎవరు పట్టించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని... ముమ్మాటికి ప్రజావ్యతిరేక పాలన అన్నారు. సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న గ్రామసభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆగ్రహం తెలుస్తోందన్నారు.
ఊరూరా జనం తిరగబడుతున్నారని, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలను నిర్వహించే పరిస్థితులు వచ్చాయన్నారు. పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఓ వైపు గ్రామసభలు నిర్వహిస్తుంటే మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నప్పుడు ఇక గ్రామసభలు ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. అంటే అర్హులైన వారికి ఇవ్వడం లేదని అర్థమేగా? అని విమర్శించారు.
ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులందరికీ ఇస్తామని చెప్పి... ఇప్పుడు భారీగా కోతలు విధిస్తే ప్రజలు తిరగబడతారన్నారు. కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందన్నారు. గ్రామసభలు, ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు... అన్నీ దగానే అన్నారు.
ఏడాదిగా కాంగ్రెస్ చేస్తోన్న దగాను ప్రజలు అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. అందుకే ఈరోజు యావత్ తెలంగాణ ఏకమై ఈ దుర్మార్గపు పాలనను నిలదీస్తోందన్నారు. మీ రాక్షస పాలనతో విసిగివేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా మారి మీపైకి రాకముందే కాంగ్రెస్ కళ్లు తెరవాలని సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలన్నారు.