Wife Off: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్!

- ఈటీవీ విన్ కి 'వైఫ్ ఆఫ్'
- ఓటీటీలోకి డైరెక్ట్ ఎంట్రీ
- సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఓటీటీ ఆడియన్స్ ను పలకరించడానికి ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'వైఫ్ ఆఫ్'. రాహుల్ తమడ-సాయిదీప్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి భాను దర్శకత్వం వహించాడు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఓటీటీకి వదులుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' సొంతం చేసుకుంది.
నేరుగా ఈటీవీ విన్ నుంచి ప్రేక్షకులను ఈ సినిమా పలకరించనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. దివ్యశ్రీ- అభినవ్ మణికంఠ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో... నిఖిల్, సాయిశ్వేత, వీర్, కిరణ్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
కథ విషయానికి వస్తే... 'అవని' తన బావకి మనసిస్తుంది. అతనితో తన జీవితం అందంగా సాగిపోతుందని భావిస్తుంది. అయితే వివాహమైన దగ్గర నుంచి అతను అవనిని హింసిస్తూ ఉంటాడు. అతని ఆగడాలు అంతకంతకూ శృతిమించిపోతూ ఉంటాయి. అప్పుడు అవని ఏం చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.
