Chandrababu: జవాన్ కార్తీక్ మృతి పట్ల చంద్రబాబు, జగన్ సంతాపం

- సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ వీరమరణం
- కార్తీక్ మృతి వార్త కలచివేసిందన్న చంద్రబాబు
- కార్తీక్ ధైర్యసాహసాలకు, త్యాగానికి శాల్యూట్ అన్న జగన్
జమ్మూకశ్మీర్ లో నిన్న సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. బంగారువాండ్లపల్లె మండలం ఎగువ రాగిమానుపెంటకు చెందిన కార్తీక్ ముష్కరులను ఎదుర్కొంటూ తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు. ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
కార్తీక్ మృతి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్తీక్ కు సంతాపం ప్రకటిస్తూ... ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జగన్ స్పందిస్తూ... కార్తీక్ చూపించిన ధైర్యసాహసాలకు, త్యాగానికి శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.