Army Jawan: కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృతి

Jawan succumbs to injuries after gunbattle with terrorists in Sopore

  • సోమవారం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు
  • ఏపీ జవాను కార్తీక్ కు బుల్లెట్ గాయాలు
  • చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరో సైనికుడిని పొట్టనబెట్టుకున్నారు. సోమవారం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జవాను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఎక్కడికక్కడ పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసినా, కేంద్ర బలగాలతో నిరంతర పహారా కాస్తున్నా జమ్మూ రీజియన్ లో ఉగ్రమూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో సోమవారం నార్త్ జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాను పంగల కార్తీక్ కు బుల్లెట్ గాయాలయ్యాయి.

గాయపడ్డ కార్తీక్ ను తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణవార్తతో రాగి మానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కార్తీక్ ఇటీవల దీపావళి పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు ఊరిలో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.

  • Loading...

More Telugu News