Rajyalakshmi: బాలకృష్ణగారు అలా అనగానే షాక్ అయ్యాను: 'శంకరాభరణం' రాజ్యలక్ష్మి!

- 'శంకరాభరణం'తో పరిచయమైన రాజ్యలక్ష్మి
- ఆ సినిమాతో బిజీ అయినట్టుగా వెల్లడి
- సెట్లో బాలకృష్ణ సరదాగా ఉంటారని వ్యాఖ్య
- మంచి మనసున్న మనిషి అంటూ కితాబు
'శంకరాభరణం' సినిమాతో తెలుగు తెరకి రాజ్యలక్ష్మి పరిచయమయ్యారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను 'తెనాలి'లో పుట్టి పెరిగాను. 'శంకరాభరణం' సినిమాతో విశ్వనాథ్ గారు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు .. నా ఇంటి పేరుగా మారిపోయింది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులకు మాత్రమే లభించే అదృష్టం ఇది" అని అన్నారు.
'శంకరాభరణం' తరువాత ఒక ఆర్టిస్టుగా ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. బాలకృష్ణగారితో మూడు నాలుగు సినిమాలు చేశాను. సెట్లో ఆయన చాలా సరదాగా ఉండేవారు. తాను రామారావుగారి అబ్బాయిననే ఫీలింగ్ ను ఎప్పుడూ చూపించేవారు కాదు. తనకంటే వయసులో పెద్దవారిని ఎంతగానో గౌరవించేవారు. నాతో పాటు సెట్ కి వచ్చిన మా అమ్మగారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. తనలో ఎప్పుడూ కోపాన్ని చూడలేదు" అని చెప్పారు.
" ఒకసారి మా అమ్మగారు నాతో పాటు సెట్ కి రాలేదు. తనకి చిన్నపాటి ఆపరేషన్ జరిగిందని బాలకృష్ణ గారితో చెప్పాను. షూటింగు పూర్తయిన తరువాత నాతో పాటు మా ఇంటికి వస్తున్నట్టు చెప్పారు. అప్పటికే ఆయన స్టార్ .. నేను నమ్మలేకపోయాను. నాతో పాటు ఆయన మా ఇంటికి వచ్చారు. అమ్మ పూజలో ఉందని తెలిసి .. అది అయ్యేవరకూ వెయిట్ చేసి .. ఆమెను పలకరించి వెళ్లారు. నిజంగా ఆయన మంచి మనసున్న మనిషి" అని అన్నారు.