Tulasi Reddy: పవన్ కు నారా లోకేశ్ పోటీ అవుతున్నాడనుకుంటే..: ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు

- లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతల డిమాండ్
- డిప్యూటీ సీఎం పదవి ఆరో వేలువంటిదన్న తులసిరెడ్డి
- లోకేశ్ సామర్థ్యంపై నమ్మకం ఉంటే సీఎం పదవి అడగాలని సూచన
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పవన్ ను సీఎంగా చూడాలని ఉందంటూ కొందరు జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటుండటంతో... టీడీపీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దంటూ టీడీపీ నేతలకు హుకుం జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిపై ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఆరో వేలు వంటిదని... దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు.
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని తులసిరెడ్డి చెప్పారు. వాస్తవానికి ఆ పదవికి ఎలాంటి ప్రొటోకాల్ ఉండదని అన్నారు. డిప్యూటీ సీఎంకు అదనపు అధికారాలు, హక్కులు ఉండవని తెలిపారు. లోకేశ్ పై ప్రేమ ఉంటే, ఆయన సామర్థ్యంపై నమ్మకం ఉంటే లోకేశ్ కు సీఎం పదవి ఇవ్వమని టీడీపీ నేతలు అడగాలని చెప్పారు. లేదా పవన్ కు లోకేశ్ పోటీ అవుతున్నాడనుకుంటే... పవన్ కున్న డిప్యూటీ డిప్యూటీ సీఎం పదవిని పీకేయాలని కామెంట్ చేశారు.