Kolikapudi Srinivas: అదే వైసీపీ కుటుంబ సభ్యులు చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు: కొలికపూడి శ్రీనివాస్

- టీడీపీ కార్యకర్త మృతి చెందితే గోపాలపురం వెళ్లానన్న కొలికపూడి
- సిమెంట్ రోడ్డుపై వైసీపీకి చెందిన కుటుంబ సభ్యులు ముళ్ల కంచె వేశారని వెల్లడి
- ముళ్ల కంచెను తొలగించిన తనను టార్గెట్ చేశారని మండిపాటు
గోపాలపురం మహిళ ఆత్మహత్యాయత్నం విషయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆయన టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 11న టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శ కోసం గోపాలపురం గ్రామానికి వెళ్లానని... అక్కడ ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డుపై వైసీపీకి చెందిన ఒక కుటుంబ సభ్యులు ముళ్ల కంచె అడ్డంగా వేశారని.... స్థానికులు ఆ కంచెను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తాను ఆ కంచెను తొలగించానని.... దీంతో ఆ వైసీపీ కుటుంబ సభ్యులు తనను టార్గెట్ చేశారని.... ఆత్మహత్యాయత్నం చేసి రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.
అదే వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేసిందని చెప్పారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ వాహనాలపై దాడులు చేశారని తెలిపారు. ఆరోజు జరిగిన పరిణామాల గురించి క్రమశిక్షణ కమిటీకి వివరించానని చెప్పారు. జరిగింది ఒకటైతే... సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోందని అన్నారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న ముళ్ల కంచెను తొలగించడమే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు.