Rishabh Pant: రిషభ్ పంత్‌కి ఎల్‌ఎస్‌జీ కెప్టెన్సీ... అధికారికంగా ప్ర‌క‌టించిన ఫ్రాంచైజీ!

Lucknow Super Giants Announce New Captain For IPL 2025
  • పంత్‌ను త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా ప్ర‌క‌టించిన ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా 
  • ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌ను రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన ల‌క్నో
  • 2021, 2022, 2024ల‌లో డీసీ కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్‌
ఐపీఎల్-2025 సీజన్‌కు గాను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) కు రిషభ్‌ పంత్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌ను ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఎల్‌ఎస్‌జీ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. పంత్ 2021, 2022, 2024లో డీసీ కెప్టెన్‌గా ఉన్నాడు.

అయితే, అతను కొత్త సీజన్‌కు ముందు ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వేలంలోకి వ‌చ్చాడు. ఇక వేలంలో ఎల్‌ఎస్‌జీ, డీసీ అత‌ని కోసం తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. ఢిల్లీ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం)ని ఉపయోగించగా, ల‌క్నో రికార్డ్ స్థాయిలో రూ.27కోట్ల‌ బిడ్‌తో పంత్‌ను కైవసం చేసుకుంది. దాంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచాడు. 

"రిషభ్‌ పంత్ ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు మాత్రమే కాదు, అత్యుత్తమ ఆటగాడు. వ‌చ్చే సీజ‌న్ నుంచి పంత్ మా జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు" అని ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా ప్ర‌క‌టించారు. 

కాగా, కేఎల్‌ రాహుల్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా తర్వాత ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ నాల్గవ వాడిగా పంత్ నిల‌వ‌నున్నాడు. ఇక 2022లో ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ కొత్త‌గా ఐపీఎల్ లో చేరిన విష‌యం తెలిసిందే. 2022, 2023 సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు చేరిన ఆ జ‌ట్టు 2024లో మాత్రం ఏడ‌వ స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.      

ఇక పంత్ 2023 సీజన్ మినహా ఐపీఎల్‌ 2021 నుంచి 2024 ఎడిషన్‌ల వరకు డీసీ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ ప‌డ‌డంతో 2023 ఐపీఎల్ సీజ‌న్‌ను కోల్పోయాడు. కాగా, ఈసారి ఎల్ఎస్‌జీలో పంత్ ఆ జ‌ట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, మెంటార్ జహీర్ ఖాన్‌తో కలిసి పని చేయ‌నున్నాడు. 

ల‌క్నో జ‌ట్టు బ్యాటింగ్ విభాగంలో పంత్‌తో పాటు నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌క్రమ్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్ వంటి ఆట‌గాళ్ల‌తో స్ట్రాంగ్‌గా ఉంది. అటు బౌలింగ్ విభాగంలో టీమిండియా సీమర్లు ఆకాశ్‌ దీప్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్‌, అవేశ్ ఖాన్‌లతో పాటు టాలెంటెడ్ స్పిన్న‌ర్‌ రవి బిష్ణోయ్ ఉన్నారు.
Rishabh Pant
Lucknow Super Giants
IPL 2025
Cricket
Sports News

More Telugu News