CapitaLand: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీపార్క్.. రూ. 450 కోట్లతో ఏర్పాటుకు సింగపూర్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ రెడీ!

CapitaLand company ready to invest Rs 450 Cr In Hyderabad

  • రేవంత్‌రెడ్డి మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతం
  • ఇప్పటికే ఈ సంస్థకు హైదరాబాద్‌లో మూడు యూనిట్లు
  • ఫ్యూచర్‌సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు టెలీ మీడియా గ్లోబల్ సెంటర్ రెడీ
  • దావోస్ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం

హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో కొత్తగా ఐటీపార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సింగపూర్‌లో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్ ఫండ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

క్యాపిటల్ సంస్థకు హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ పార్కులు ఉన్నాయి. ఈ సంస్థ గతంలో 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్‌ను ప్రకటించింది. అది ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. అలాగే, ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. 

సింగపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు అధికారులతో కూడిన ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. అనంతరం అక్కడి నుంచి ఈ బృందం గత రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరింది. అక్కడ జరిగే ‘ప్రపంచ ఆర్థిక వేదిక’  సదస్సుల్లో బృందం పాల్గొంటుంది. 

కాగా, హైదరాబాద్‌లో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్‌సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు సింగపూర్‌కు చెందిన టెలీ మీడియా గ్లోబల్ సెంటర్ ముందుకొచ్చింది. ఇందుకోసం సంస్థ రూ. 3,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అలాగే, సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

More Telugu News