Chandrababu: అమిత్ షా పనితీరు చూస్తే కొన్నిసార్లు అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu hails Amit Shah in NDRF Foudation Day event

  • కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
  • హాజరైన అమిత్ షా, చంద్రబాబు తదితరులు
  • అమిత్ షా అన్ని అంశాల్లో వినూత్నంగా ఆలోచిస్తారన్న చంద్రబాబు
  • కేంద్రం నుంచి మరింత సహకారం కోరుతున్నామని వెల్లడి

కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 

హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్ నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. 

"భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్‌షా పట్టుదలతో పని చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. నేను చాలామంది హోంమంత్రులను చూశాను కానీ... ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా. అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం, నియామకాలు చేపట్టడమొక్కటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. దేశంలో ఏ మూలాన ఆపదలో ఉన్నా వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమితాషా ఉన్నారు. దేశంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పని చేసి చక్కదిద్దుతున్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. సమర్ధతతో పని చేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్నికొన్నిసార్లు నాకు అసూయ కలుగుతుంది. మనిషిలా కాకుండా మిషన్‌లా పని చేస్తున్నారు. చాలా మంది నేతలు రిబ్బన్‌లు కట్ చేసి ప్రసంగించి వెళ్లిపోతారు. కానీ అమిత్‌షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలు తెలుసుకుంటారు" అని వివరించారు.

ఇక, గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఏపీలో ఘనవిజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయానికే ఏపీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని, అందుకు కేంద్రం పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. అయితే, ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడినా, ఇంకా పేషెంట్ గానే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేంద్రం మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రం వాల్ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక, తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని ఆకాంక్షించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. 

ప్రధాని మోదీ కలను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నామని, ఏపీలోనూ విజన్-2047 లక్ష్యంగా ముందుకెళుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News