Indian Railways: రైల్వే బెడ్ షీట్లు తీసుకెళుతూ పట్టుబడ్డ ప్రయాణికుడు.. వీడియో ఇదిగో!

Passengers Hide Railway Bed Sheets In Luggage

  • లగేజీ చెక్ చేసి అన్నింటినీ రికవరీ చేసిన రైల్వే ఉద్యోగులు
  • ఇదేం కక్కుర్తి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
  • ప్రయాణికులు బెడ్ షీట్లు ఎత్తుకెళితే కోచ్ అటెండెంట్ జీతంలో కోత

ఏసీ కోచ్ లో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ దుప్పట్లు, బెడ్ షీట్లను అందుబాటులో ఉంచుతుంది.. ప్రయాణంలో వాటిని ఉపయోగించుకుని అక్కడే వదిలేయాలి. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం వాటిని తన బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కోచ్ లో బెడ్ షీట్లు కనిపించకపోవడంతో అటెండెంట్ వారిని ఆపి లగేజీ తనిఖీ చేయగా.. బ్యాగులో నుంచి బెడ్ షీట్లు, దుప్పట్లు, టవల్స్ బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుందీ ఘటన. లగేజీ తనిఖీ చేస్తున్న వ్యవహారాన్ని వీడియో తీసి రైల్వే ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

సదరు ప్రయాణికుడి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం కక్కుర్తి పనంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన వస్తువులు ఏవైనా తమవే అనుకునే వారి సంఖ్య ఎక్కువే ఉందంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్విట్టర్ లో వైరల్ గా మారిన ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ.. రైల్వే శాఖకు నష్టాలు ఎలా వస్తున్నాయో బహుశా అధికారులకు ఇప్పుడు అర్థమై ఉంటుందని భావిస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం ఈ ఘటన సిగ్గుచేటని, మన సౌకర్యం కోసం ఉంచిన వస్తువులను ఇలా దొంగతనం చేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు.

ప్రయాణికులు బెడ్ షీట్లు ఎత్తుకెళితే ఏం జరుగుతుంది..?
ఏసీ కోచ్ లకు ప్రతీ దానికీ ఓ అటెండెంట్ ను రైల్వే శాఖ నియమిస్తుంది. రైల్వే కాంట్రాక్టర్ తరఫున ఓ తాత్కాలిక ఉద్యోగి కోచ్ అటెండెంట్ గా సేవలందిస్తాడు. ప్రయాణికులు సౌకర్యవంతంగా గమ్యం చేరేందుకు సాయం చేస్తాడు. ప్రయాణికులు బెడ్ షీట్లను వెంట తీసుకెళితే ఆ బెడ్ షీట్ సహా కోచ్ లో ఏ వస్తువు పోయినా దాని ఖరీదును సదరు కోచ్ అటెండెంట్ జీతంలో నుంచి కాంట్రాక్టర్ కట్ చేసుకుంటాడు. తమకు వచ్చే జీతమే తక్కువ.. అందులో మళ్లీ ఇలా చోరీకి గురైన వస్తువుల ఖరీదు మినహాయిస్తే కుటుంబాన్ని పోషించుకోవడం తమకు కష్టమవుతుందని కోచ్ అటెండెంట్లు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News