Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక.. ఫైనల్‌లో విఫలమైన కరుణ్ నాయర్

- విదర్భను ఓడించి విజేతగా నిలిచిన కర్ణాటక
- 36 పరుగుల తేడాతో పరాజయం పాలైన విదర్భ
- కర్ణాటక 50 ఓవర్లలో 348 పరుగుల భారీ స్కోరు
- లక్ష్యఛేదనలో విదర్భ 312 పరుగులకే ఆలౌట్
- ఐదవసారి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న కర్ణాటక
- విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డు
శనివారం వడోదరలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో విదర్భను ఓడించి కర్ణాటక విజేతగా నిలిచింది. 36 పరుగుల తేడాతో ఓడించి, ఐదవసారి విజయ్ హజారే ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగుల భారీ స్కోరు చేసింది. 349 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విదర్భ 312 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ధ్రువ్ షోరే శతకం (110)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
కాగా, ధ్రువ్ షోరేకు ఈ టోర్నీలో వరుసగా ఇది మూడవ సెంచరీ కావడం విశేషం. అటు వరుస సెంచరీలతో చెలరేగిన విదర్భ సారథి కరుణ్ నాయర్ ఫైనల్లో మాత్రం విఫలం అయ్యాడు. కేవలం 27 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న ఆల్‌రౌండర్ హర్ష్ దూబే 30 బంతుల్లో (ఐదు సిక్సర్లు, 5 ఫోర్లు) 63 పరుగులు చేసి, విదర్భ విజయంపై ఆశలు రేపాడు. వాసుకి కౌశిక్ (10 ఓవర్లలో 3/47), ప్రసిద్ధ్ కృష్ణ (10 ఓవర్లలో 3/84), అభిలాష్ శెట్టి (9.2 ఓవర్లలో 3/58) విదర్భ బ్యాటర్లకు కళ్లెం వేశారు.
మరోవైపు కర్ణాటక విజేతగా నిలవడంతో ఆ జట్టు స్మరణ్ రవిచంద్రన్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు కేవలం 92 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతనికి తోడుగా కృష్ణన్ శ్రీజిత్ (74 బంతుల్లో 78 పరుగులు), అభినవ్ మనోహర్ (42 బంతుల్లో 79 పరుగులు) విజృంభించడంతో కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. అలాగే ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకుని అన్నింటిలోనూ విజయం సాధించిన జట్టుగా కర్ణాటక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక టోర్నీ ఆసాంతం రాణించిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు.