Cab Driver: ఏడు నిమిషాలు ఆలస్యమైనందుకు క్యాబ్ డ్రైవర్‌పై మహిళ చిందులు... ఆఖరికి ఉమ్మివేసింది కూడా.. వీడియో ఇదిగో!

- ప్రయాణికురాలికి, క్యాబ్ డ్రైవర్‌కు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం తాలూకు వీడియో వైరల్
- మహిళ అంతగా దుర్భాషలాడిన ఆమె వీరంగాన్ని ప్రశాంతంగా వీడియో తీసిన డ్రైవర్
- వీడియో బయటకు రావడంతో తమదైనశైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
ఓ మహిళా ప్రయాణికురాలికి, క్యాబ్ డ్రైవర్‌కు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తాను బుక్ చేసుకున్న క్యాబ్ కేవలం ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్‌ను ఆ మహిళ దుర్భాషలాడుతూ అవమానించడం వీడియోలో ఉంది. ఆఖరికి ఆమె క్యాబ్ నుంచి బయటకు వస్తూ అతనిపై ఉమ్మి వేసింది కూడా.
అయితే, డ్రైవర్ మాత్రం ఆమె అంతగా దుర్భాషాలాడిన ప్రశాంతంగా ఉండి, సమాధానం చెప్పడం మనం చూడొచ్చు. ఒకవేళ అసౌకర్యంగా ఉంటే క్యాబ్ కంపెనీకి ఫిర్యాదు చేసుకోవాలని, వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోవచ్చని కూడా మర్యాదగా ఆమెను సూచించాడు. అంతే ప్రశాంతంగా ఆమె వీరంగాన్ని డ్రైవర్ వీడియో కూడా తీశాడు.
"ఈ క్యాబ్ డ్రైవర్ 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. క్యాబ్ బుక్ చేసిన మహిళ డ్రైవర్‌ని దుర్భాషలాడింది. బెదిరించింది. ఆఖరికి అతనిపై ఉమ్మివేసింది కూడా. కానీ, టాక్సీ డ్రైవర్ మాత్రం ప్రశాంతంగా, కంపోజ్‌గా ఉన్నాడు. అతను ఈ సంఘటనను రికార్డ్ చేయడం బాగుంది. లేకపోతే ఆ మహిళ వీరంగం బయటకు వచ్చేది కాదు. ఇలా ఆలస్యం కాకూడదనుకుంటే ఆమె తన సొంతంగా కారు కొనుగోలు చేసి ప్రయాణం చేయడం బెటర్" అని ఓ 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ వీడియోను పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
"ఆమెను అన్ని క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులను వినియోగించుకోకుండా నిషేధించాలి. ఇలాంటి కస్టమర్ల నుంచి తమ డ్రైవర్లను కాపాడుకోవడం క్యాబ్ కంపెనీల బాధ్యత కూడా" అని ఒకరు... "ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు క్యాన్సిల్ చేసుకుని వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అందులోనూ క్యాబ్‌లోకి ఎక్కిన తర్వాత ఈ రాద్ధాంతం ఏంటి? అసలు డ్రైవర్‌ను అవమానించడానికి ఆమె ఎవరు? ఇది చాలా బాధాకరమైన సంఘటన" అని మరొకరు... "ఆమెను ఇకపై క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకోకుండా నిషేధించాలి. అలాగే ఆమె పనిచేస్తున్న కంపెనీ జాబ్ నుంచి కూడా తొలగిస్తే బాగుంటుంది. ఇలాంటి వారిని ఆ కంపెనీ ఎలా ఉద్యోగంలో తీసుకుందో?" అని ఇంకొకరు కామెంట్ చేశారు.