Madhavi Latha: మళ్లీ తెరపైకి ఆ వివాదం... జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 'మా'కు మాధవీలత ఫిర్యాదు

- జేసీ ప్రభాకర్‌రెడ్డి తన పట్ల దారుణంగా మాట్లాడారన్న నటి
- వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్య
- జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదన్న మాధవీలత
- ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్, 'మా'కు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అన్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని మాధవీలత తెలిపారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొన్నారు. ఇక ఫిర్యాదు చేయడానికి ముందు మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో న్యాయం కోసం నా పోరాటం అంటూ ఓ పోస్టు కూడా పెట్టారు.
కాగా, గతేడాది డిసెంబర్ 31న జేసీ పార్కులో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకలపై మాధవీలతతో పాటు మరో బీజేపీ నేత సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతకరమైన పదాలతో దూషించడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దాంతో జేసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మాధవీలత ఫిర్యాదుతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.