Chaganti: చాగంటికి అవమానం జరగలేదు: టీటీడీ

- తిరుమలలో చాగంటికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- ప్రొటోకాల్ ప్రివిలేజ్ ను చాగంటి తిరస్కరించారన్న టీటీడీ
- సాధారణ భక్తుల మాదిరే స్వామి దర్శనం చేసుకున్నారని వెల్లడి
ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది.
ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి ఈ నెల 16న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చామని టీటీడీ తెలిపింది. కేబినెట్ ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం ఆయనకు 14వ తేదీన తిరుమలలో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశామని... ఆయన వయసు రీత్యా ఆలయం ముందున్న బయోమెట్రిక్ నుంచి దర్శనానికి వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ చాగంటి సున్నితంగా తిరస్కరించారని వెల్లడించింది.
సాధారణ భక్తుల మాదిరే చాగంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని టీటీడీ తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని... తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.