IRCTC: సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు.. ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

- ఫిబ్రవరి 15న సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న రైలు
- మొత్తం 8 రోజుల ప్రయాణంలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శన
- ఎకానమీ క్లాస్‌లో టికెట్ పెద్దలకు రూ. 23,035, పిల్లలకు రూ. 22,140
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి 22న నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజులపాటు సాగే ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను దర్శించుకునేందుకు వీలుగా ప్యాకేజీని రూపొందించింది. ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు రూ. 23,035, 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ. 22,140గా చార్జీలు నిర్ణయించారు.
15న సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 18న ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. 19న వారణాసిలో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుని అదే రోజు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 20న అయోధ్య చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 22న రాత్రి రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్ (బరంపురం), చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసూర్ స్టేషన్లలో ఆగుతుంది.