BJP: ఢిల్లీ ఓటర్లపై బీజేపీ ఉచితాల వర్షం.. అన్న క్యాంటీన్ తరహాలో అటల్ క్యాంటీన్!

BJP Release Manifesto Ahead Of Delhi Assembly Polls

  • మ్యానిఫెస్టో విడుదల చేసిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
  • గర్భిణులకు రూ. 21 వేలు, పోషకాహార కిట్లు
  • మహిళా సమృద్ధి యోజన కింద మహిళలకు నెలకు రూ. 2,500
  • రూ. 500కే ఎల్పీజీ సిలిండర్
  • హోళీ, దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటన
  • ఉచితాలపై మోదీ ఇప్పుడేమంటారని కేజ్రీవాల్ ప్రశ్న

ఢిల్లీలో ఓటర్లపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆప్, ఈసారి ఎలాగైనా ఆప్‌ను పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ప్రకటిస్తున్న హామీల వర్షంతో ఓటర్లు తడిసి ముద్దవుతున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న 'సంకల్ప్ పత్ర్ ' పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు రూ. 21 వేల ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆరు పోషకాహార కిట్లు అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు, ప్రస్తుతం మొదటి కాన్పుకు అందిస్తున్న రూ. 5 వేలు, రెండో కాన్పుకు అందిస్తున్న రూ. 6 వేలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి నెలా మహిళలకు రూ. 2500, రూ. 500కే ఎల్పీజీ సిలిండర్, హోళీ, దీపావళి సమయంలో ఒక్కో ఉచిత సిలిండర్ ఇస్తామని వివరించారు. అలాగే, 60 నుంచి 70 ఏళ్ల లోపు వృద్ధులకు నెలకు రూ. 2,500, ఆపైబడిన వారికి, దివ్యాంగులు, వితంతువులకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. ‘అటల్ క్యాంటీన్’లు ఏర్పాటు చేసి రూ. 5కే భోజనం అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. 

మోదీ ఇప్పుడేమంటారు?
బీజేపీ మ్యానిఫెస్టోపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఉచితాలు ఇస్తారని బీజేపీ తనను విమర్శించేదని, మరి బీజేపీ ఇప్పుడు ప్రకటించిన ఉచితాలపై మోదీ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంతకాలం ఉచితాలు మంచివి కావని మోదీ అనేవారని, ఇప్పుడు వారు ప్రకటించిన మ్యానిఫెస్టో ద్వారా ఉచితాలు మంచివేనని తేలిందని అన్నారు. ఉచితాలు హానికరం కావని, మంచివేనని మోదీ ఇప్పుడు అంగీకరించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News