KTR: చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక రాబోతుంది: కేటీఆర్ జోస్యం

KTR expects bypoll in Chevella soon

  • ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్న కేటీఆర్
  • కేసీఆర్‌కు ఓటేయడంతో చేవెళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే గెలిచాడన్న కేటీఆర్
  • ఆ తర్వాత రేవంత్ రెడ్డి చంకలో దూరాడని చురక

చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చేవెళ్లలో ఉపఎన్నిక రానుందని, ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు కేసీఆర్‌కు ఓటేయడంతో ఇక్కడి ఎమ్మెల్యే గెలిచాడని, కానీ ఇప్పుడా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చంకలో దూరాడని మండిపడ్డారు. నియోజకర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరానని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. మరి ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీలు అమలయ్యాయా? రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా అమలయ్యాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

రేవంత్ రెడ్డి నోట అన్నీ అబద్ధాలే వస్తున్నాయని, మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో వచ్చిన 44 వేల ఉద్యోగాలను తాము ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రైతు భరోసా జమ చేయాలని, లేదంటే రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వీపు చింతపండు చేస్తారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామన్నారు.

KTR
Telangana
BRS
Congress
  • Loading...

More Telugu News