Daggubati Purandeswari: అమిత్ షా, చంద్రబాబు సమావేశంలో కీలక అంశాలు చర్చకు వస్తాయి: పురందేశ్వరి

- రేపు ఏపీకి వస్తున్న అమిత్ షా
- రేపు సాయంత్రం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్న కేంద్ర హోం మంత్రి
- ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందన్న పురందేశ్వరి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు ఏపీ పర్యటనకు రాబోతున్నారు. రేపు సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఆయన వెళతారు. వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు నివసంలోనే అమిత్ షా భోజనం చేస్తారు. రేపు రాత్రికి విజయవాడ నొవోటెల్ హోటల్ లో ఆయన బస చేస్తారు. ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
చంద్రబాబుతో అమిత్ షా భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఇద్దరి మధ్య ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాజ్ పేయి హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు నిధులు విడుదల చేశామని... ఇప్పుడు కూడా విడుదల చేశామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తామే అడిగామని తెలిపారు. వైజాగ్ స్టీల్ కు కచ్చితంగా కేప్టివ్ మైన్స్ కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని అన్నారు.