Naga Chaitanya: మత్స్యకారుల కోసం చేపల పులుసు వండిన నాగచైతన్య... వీడియో ఇదిగో

Akkineni Nagachaitanya makes Chepala Pulusu for fishermen

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
  • చందు మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్న నాగచైతన్య

అక్కినేని హీరో నాగచైతన్య కొత్త చిత్రం 'తండేల్'. సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. తాజాగా, నాగచైతన్య ఓ ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. అందులో ఆయన రుచికరమైన చేపల పులుసు వండడం చూడొచ్చు. 

ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర పోషించేందుకు గాను నాగచైతన్య కొందరు మత్స్యకారుల జీవితాలను దగ్గర్నుంచి పరిశీలించి, తనను మలుచుకున్నారు. మీరు వండినట్టే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి మీకు వడ్డిస్తాను అని షూటింగ్ ప్రారంభంలో ఆ మత్స్యకారులకు నాగచైతన్య మాటిచ్చారట. అన్నట్టుగానే ఆయన మాట నిలుపుకున్నారు. 

కట్టెల పొయ్యిపై మట్టి పాత్రను ఉంచి... అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కలను వేసి... ఉప్పు, కారం, పసుపు పట్టించి... అందులో కొంచెం నూనె వేసి.... తగినంత చింతపండు పులుసు పోసి... చివర్లో కాస్తంత కొత్తిమీర చల్లి... ఘుమఘుమలాడే చేపల పులుసును తయారు చేశారు. తనకు సహకారం అందించిన మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టారు. నచ్చిందా అని అడిగారు. అది తిన్న వారందరూ వాహ్ అని మెచ్చుకున్నారు. 

అప్పటికీ నాగచైతన్య... నేను చేపల పులుసు వండడం ఇదే ఫస్ట్ టైమ్... బాగా లేకపోతే ఏమీ అనుకోవద్దు అంటూ నవ్వుతూ చెప్పారు. తాను కూడా వారితో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

More Telugu News