Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్..?

- డీసీకి అక్షర్ కెప్టెన్‌గా ఉండే ఛాన్స్ అంటూ జాతీయ మీడియా కథనాలు
- రాహుల్, డుప్లెసిస్ ఉన్నా టీమ్ మేనేజ్‌మెంట్ అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం
- అక్షర్ కెప్టెన్సీపై సహ యజమాని పార్త్ జిందాల్ హింట్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరిద్దరూ గతంలో ఐపీఎల్ జట్ల(ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ)కు కెప్టెన్‌గా ఉన్నారు.
ఇక అక్షర్ 2019 నుంచి డీసీకి ఆడుతున్న విషయం తెలిసిందే. 2024 ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక మ్యాచ్‌లో కెప్టెన్సీ కూడా చేశాడు. తాజాగా బీసీసీఐ ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ 20 సిరీస్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించింది.
అక్షర్ కెప్టెన్సీపై సహ యజమాని పార్త్ జిందాల్ హింట్
ఐపీఎల్ 2025 వేలం తర్వాత అక్షర్ పటేల్ ఫ్రాంచైజీకి భవిష్యత్ లో కెప్టెన్‌గా ఉండవచ్చని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ గతంలో హింట్ ఇచ్చారు.
ఆయన ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. "అక్షర్ పటేల్ చాలా కాలం పాటు ఫ్రాంచైజీతో ఉన్నాడు. గత సీజన్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్ లో ఫ్రాంచైజీకి సారథిగా ఉండే అవకాశం లేకపోలేదు" అని అన్నారు. దీంతో అక్షర్‌కు కెప్టెన్సీ పదోన్నతి లభిస్తుందన్న ఊహాగానాలకు జిందాల్ మాటలు ఆజ్యం పోశాయి.
ఇక కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ పదవికి విస్మరిస్తారా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే రాహుల్ డీసీకి కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందని ఇంతకుముందు చాలా ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. అంతేగాక అతను లక్నో సూపర్ జెయింట్‌ను 2022, 2023లలో వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కెప్టెన్‌గా చాలా కీరోల్ పోషించాడు. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ ను డీసీ ఏకంగా రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.