Kieron Pollard: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. టీ20 హిస్టరీలో రెండవ ప్లేయర్ ఇతడే

- టీ20 క్రికెట్‌లో 900 సిక్సర్లు బాదిన రెండవ క్రికెటర్‌గా నిలిచిన వెస్టిండీస్ దిగ్గజం
- ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో చెలరేగుతున్న హిట్టర్
- 1,056 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న క్రిస్ గేల్
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరో క్రికెట్ మైలురాయిని సాధించాడు. టీ20 క్రికెట్ హిస్టరీలో 900 సిక్సర్లు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్... డెసెర్ట్ వైపర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 23 బంతులు ఎదుర్కొని 36 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ మూడు సిక్సర్లతో కలుపుకొని టీ20 క్రికెట్‌లో అతడి సిక్సర్ల సంఖ్య 900 దాటింది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి 900వ సిక్సర్‌ను సాధించాడు.
ఈ మైలురాయి సాధించిన రెండవ ప్లేయర్ పొలార్డ్ కావడం విశేషం. వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, పొలార్డ్ 2006లో తన టీ20 కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకు మొత్తం 690 మ్యాచ్‌లు ఆడి 901 సిక్సర్లు సాధించాడు. టాప్-4 ప్లేయర్లు వెస్టిండీస్ ఆటగాళ్లే కావడం విశేషం.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే
1. క్రిస్ గేల్ - 1056 సిక్సర్లు
2. కీరన్ పొలార్డ్ - 901 సిక్సర్లు
3. ఆండ్య్రూ రస్సెల్స్ - 727 సిక్సర్లు
4. నికోలస్ పూరన్ - 592 సిక్సర్లు
5. కోలిన్ మన్రో - 550 సిక్సర్లు