Crime News: వసతిగృహంలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడి అత్యాచారం

- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
- హాస్టల్ భవనంపై ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు
- పార్టీ అనంతరం నిందితురాలి గదిలోకి ప్రవేశించిన నిందితుడు
- బాధితురాలి కేకలు విని తలుపులు వేసి బంధించిన ఇతర విద్యార్థినులు
- పోలీసులకు సమాచారం.. నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గేట్ వద్ద ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. హాస్టల్ భవనం కింద ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసు ఉంది. బుధవారం రాత్రి భవనం పై అంతస్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జోన్నాయిచింతకు చెందిన అజిత్ (22) కూడా పాల్గొన్నాడు. వేడుక అనంతరం హాస్టల్‌లోకి వెళ్లిన అజిత్ ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి కేకలు విన్న మరో గదిలోని విద్యార్థినులు తలుపునకు గడియపెట్టి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.