Double Murder Case: పుప్పాలగూడ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది.. నిందితుల అరెస్ట్!

- ఏకాంత సమయంలో వీడియో తీయొద్దన్నందుకు బిందును, విషయం తెలిసి హెచ్చరించినందుకు అంకిత్ హత్య
- హత్య తర్వాత మధ్యప్రదేశ్‌లోని సొంతూరికి పారిపోయిన నిందితులు
- ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
- ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాదుకు నిందితులు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పుప్పాలగూడ జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీయడాన్ని అడ్డుకున్నందుకు మహిళను, ఇదే విషయంలో హెచ్చరించినందుకు ఆమె ప్రియుడిని పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో హౌస్‌కీపింగ్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌కు, అక్కడే ఉంటున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. విషయం తెలిసిన బిందు భర్త వనస్థలిపురానికి మకాం మార్చినా దీనికి అడ్డుకట్ట పడలేదు.
మరోవైపు, బిందుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అంకిత్ ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. గచ్చిబౌలిలో ఉంటున్న మధ్యప్రదేశ్‌కే చెందిన అతడి స్నేహితులు రాహుల్‌కుమార్, రాజ్‌కుమార్, సుఖేంద్రకుమార్‌లు బిందును తీసుకురావాలని కోరారు. దీంతో ఈ నెల 8న బిందును తీసుకుని సాకేత్ వారి గదికి వెళ్లాడు. అక్కడ రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్‌కుమార్.. వీడియో తీసేందుకు ప్రయత్నించగా బిందు అడ్డుకుంది. ఇదే విషయాన్ని ఆమె అంకిత్‌కు చెప్పింది. దీంతో అతడు రాహుల్‌ను హెచ్చరించాడు.
వీడియో తీయకుండా అడ్డుకున్నందుకు బిందుపైనా, తనను హెచ్చరించిన అంకిత్‌పైనా కక్ష పెంచుకున్న రాహుల్ ఈ నెల 11న మరోమారు బిందును పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో బిందును సుఖేంద్ర పక్కకు తీసుకెళ్లడంతో అంకిత్ ఒంటరిగా మిగిలాడు.
ఇదే అదునుగా భావించిన రాహుల్, రాజ్‌కుమార్ అతడిపై దాడిచేసి కత్తితో పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. అది చూసి పారిపోతున్న బిందును కూడా పట్టుకుని హత్య చేశారు. ఆ తర్వాతి రోజు నిందితులు మధ్యప్రదేశ్‌లోని తమ సొంతూరికి పరారయ్యారు. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు వారి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.