Brahmanandam: తాను సినిమాలు తగ్గించడానికి గల కారణం చెప్పిన బ్రహ్మానందం

- సినిమాలు తగ్గించింది అవకాశాలు రాక, చేయలేక కాదన్న బ్రహ్మానందం
- వయసు పైబడటంతో ఇంతకు ముందుగా చేసినంత యాక్టివ్‌గా చేయలేకపోతున్నానన్న బ్రహ్మానందం
- తాజాగా 'బ్రహ్మా ఆనందం' మూవీలో నటిస్తున్న వైనం
- తాత పాత్రలో బ్రహ్మానందం, మనవడి పాత్రలో తనయుడు రాజా గౌతమ్
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'బ్రహ్మా ఆనందం' మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత, మనవడుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం పలు విషయాలను వెల్లడిస్తూ.. తాను సినిమాలు తగ్గించడానికి గల కారణాలను తెలిపారు.
బాగానే చేస్తున్నాడు కానీ, ఇంతకు ముందు ఆయన చేస్తే వచ్చినంత నవ్వు ఇప్పుడు రావడం లేదు అని కొందరు కామెంట్స్ చేయడం విన్నానన్నారు. ప్రధానంగా వయసు పైబడటం వల్ల ఇంతకు ముందు చేసినంత యాక్టివ్‌గా చేయలేకపోతున్నానని, ఈ విషయం తనకు అర్ధం అవుతోందన్నారు. వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలని, అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడం తగ్గించానని, అంతే కానీ అవకాశాలు రాక కాదు, చేయలేక కాదని బ్రహ్మానందం పేర్కొన్నారు.